నాగర్కర్నూల్, ఆగస్టు 7 (తొలి కిరణం న్యూస్): పందగ సాయన్న విగ్రహం తొలగింపు వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మండిపడుతూ, "నాకంటే మొనగాడేం కాదు మీ ఎస్పీ.. నా వెనకాల లక్షల మంది ప్రజాబలం ఉంది.. నా సత్తా ఏమిటో చూపిస్తా" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలో పందగ సాయన్న విగ్రహాన్ని తొలగించిన ఘటనపై స్పందించిన ఆయన, ఈ చర్య వెనుక ఉన్న అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీయడం సరైన విధానం కాదని అన్నారు. అలాగే, తనపై నమోదు చేసిన కేసులు, పోలీసుల వ్యవహారశైలిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తూ, పందగ సాయన్న విగ్రహాన్ని తిరిగి అదే ప్రాంతంలో ప్రతిష్ఠించేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

