నాగర్కర్నూల్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సూచించారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు హక్కు తొలగిపోకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అపోహలు, అనుమానాలకు తావులేకుండా వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని 910 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
1,15,851 మంది ఓటర్ల గుర్తింపు
2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 2002 నాటి జాబితాతో మ్యాపింగ్ కాని 13,216 మంది ఓటర్లను గుర్తించగా, ఎన్మరేషన్ ఫారాల వివరాల పరిశీలనలో మరో 1,02,635 మంది ఓటర్లు గుర్తించబడ్డారని చెప్పారు.
రెండు విభాగాల్లో కలిపి జిల్లాలో మొత్తం 1,15,851 మంది ఓటర్లు గుర్తించబడ్డారని, వీరికి గత రెండు రోజులుగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోలు స్వయంగా ఓటర్లకు నోటీసులు అందజేస్తున్నారని పేర్కొన్నారు.
నోటీసులు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
నోటీసు అందినంత మాత్రాన ఓటు తొలగించినట్లు కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటరు అర్హతను ధ్రువీకరించేందుకు నోటీసుల జారీ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
నోటీసులో పేర్కొన్న సూచనలను జాగ్రత్తగా చదివి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో జనన తేదీ, జనన స్థలానికి సంబంధించిన పత్రాలతో పాటు తల్లిదండ్రుల జనన వివరాలను ధ్రువీకరించే పత్రాలను సమర్పించాలని తెలిపారు.
తప్పులుంటే సవరణలకు అవకాశం
ఓటరు వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే సవరణలు, మార్పులు, చేర్పులకు సంబంధించి అవసరమైన దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గత ఎస్ఐఆర్ వివరాలపై సందేహాలు ఉంటే సంబంధిత బీఎల్వోలను సంప్రదించాలని తెలిపారు.
నోటీసులు, పత్రాల సమర్పణ తదితర అంశాలపై బీఎల్వోల ద్వారా అవసరమైన మార్గదర్శకత్వం పొందవచ్చని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
ప్రజలు అధికారికంగా అందే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తప్పుడు సమాచారం, అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. ప్రతి ఓటరు తన వివరాలను స్వయంగా పరిశీలించుకుని, అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం కావడానికి అధికారులు, ప్రజలు, మీడియా భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమని, ఓటరు జాబితా పకడ్బందీగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

