నాగర్‌కర్నూల్, ఆగస్టు 12: దేశ స్వాతంత్ర్యోద్యమ కాలంలో 1936 ఆగస్టు 12న ఏర్పడిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐఎస్ఎఫ్ కేవలం విద్యార్థి సంఘం మాత్రమే కాదని, విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాన విద్యా హక్కు కోసం తొమ్మిది దశాబ్దాలుగా పోరాడుతున్న చారిత్రాత్మక విద్యార్థి ఉద్యమమని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన వసతి, పుస్తకాలు, హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించి పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని కోరారు. విద్య ప్రతి విద్యార్థి హక్కు అని, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహించే ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, మాజీ విద్యార్థి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రేమ్ కుమార్ కోరారు. నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై మరింత విస్తృతంగా ఉద్యమాలు నిర్వహిస్తూ, ప్రభుత్వ విద్యను పరిరక్షించడం, విద్యార్థుల హక్కులను సాధించడం, సామాజిక మార్పు కోసం నిరంతరం పోరాడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

