సికింద్రాబాద్, ఆగస్టు 30:
సెప్టెంబర్ 9న వరంగల్లో నిర్వహించనున్న MRPS, MSP నూతన మండల కమిటీల జాతీయ సదస్సును పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని MRPS రాష్ట్ర ఇన్చార్జి డా. గోవిందు నరేష్ మాదిగ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని అడ్డగుట్ట డివిజన్లో MRPS, MSP ముఖ్య కార్యకర్తల సమావేశం MSP సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి చెండేటి వేణుగోపాల్ మాదిగ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం MRPS ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసి విజయం సాధించామని అన్నారు. వర్గీకరణ ఫలితంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. వర్గీకరణ ద్వారా లభిస్తున్న 9 శాతం రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో మాదిగలు అభివృద్ధి సాధించాలని సూచించారు.
ప్రతి బస్తీలో అక్షరాస్యతపై చైతన్యం
మాదిగ సమాజంలో అక్షరాస్యత శాతాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని గోవిందు నరేష్ మాదిగ అన్నారు. ప్రతి బస్తీలో విద్య ప్రాధాన్యతపై చైతన్యం తీసుకురావాలని, పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు.
మాదిగలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరింత ఎదిగేందుకు మంద కృష్ణ మాదిగ భవిష్యత్ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు క్షేత్రస్థాయిలో కమిటీల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.
సెప్టెంబర్ 9న వరంగల్లో జాతీయ సదస్సు
నూతనంగా ఏర్పాటు చేసిన MRPS, MSP కమిటీల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న వరంగల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు గోవిందు నరేష్ మాదిగ తెలిపారు. ఈ సదస్సుకు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా MRPS, MSP నాయకులు, కార్యకర్తలు, మాదిగ సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో MSP అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షులు మేడ బాబు మాదిగ, మెట్టుగూడ డివిజన్ అధ్యక్షులు దావా శివప్రసాద్ మాదిగ, తార్నాక డివిజన్ అధ్యక్షులు ఇరువు జగదీష్ మాదిగ, మామిడి మల్లేష్ మాదిగ, గాజుల చందర్ మాదిగ, పొట్ట విజయ్ మాదిగ, ఎర్ర గణేష్ మాదిగ, శ్రీశైలం మాదిగ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సీనియర్ నాయకులు బలుగుల మహేష్ మాదిగ, యాదగిరి మాదిగ, కమలాకర్ మాదిగ, కిరణ్ మాదిగ, భాస్కర్ మాదిగ, అనిల్ మాదిగతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


