తిరుపతి: తిరుపతి పట్టణంలోని రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి నివాసంలో రైల్వే కోడూరు నియోజకవర్గం ఎల్సీ గేట్ నంబర్ 85కు సంబంధించిన సమస్యలపై రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు, డీఆర్సీసీ సభ్యుడు భరత్ కుమార్ రెడ్డి ఎంపీని కలిసి వినతిపత్రం అందించారు.
రైల్వే కోడూరు మండలం ఉలగడ్డపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్సీ గేట్ నంబర్ 85ను రైళ్లు వెళ్లే సమయంలో తరచూ మూసివేయడంతో ప్రజలు, రైతులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రైల్వే గేట్ వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.
రానున్న రోజుల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎన్‌హెచ్ హైవేకు ఉలగడ్డపాడు రైల్వే గేట్ ప్రాంతాన్ని అనుసంధానం చేసే విధంగా హై లెవల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే రైతులు, ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుందని వివరించారు. హైవేకు నేరుగా కనెక్టివిటీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన స్కెచ్‌ను కూడా ఎంపీకి చూపించి వివరాలను తెలియజేశారు. గతంలో ఇదే అంశంపై రైల్వే శాఖ అధికారులకు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. సమస్యను మరోసారి రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి, హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఎంపీ మిథున్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు రమేష్, పుల్లంపేట మండలం బూత్ కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, రమణ, శీను తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


