నాగర్కర్నూల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ సమైక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు మరింత చేరువై పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజాసేవను తమ ప్రాథమిక బాధ్యతగా భావించి విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.


