నాగర్కర్నూల్: జిల్లా కలెక్టరేట్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. నాగర్కర్నూల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందిస్తూ పారదర్శకంగా, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు, నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని సూచించారు. దేశ సమగ్రత, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
అనంతరం వందేమాతరం గీతాలు ఆలపించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు. వారికి నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. విద్యార్థులతో ముచ్చటించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులతో కలిసి ఫొటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం, డీఆర్వో పాండు తదితర అధికారులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


