నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 29: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనం 102వ గదిలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆప్తలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. పరీక్షల్లో క్యాటరాక్ట్ (కంటి పొర) సమస్య ఉన్న 27 మందిని గుర్తించి, ఆపరేషన్ల కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో లయన్స్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. శిబిరంలో రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన సూచనలు, మందులు అందజేశారు. జీవితకాలం కంటి చూపును కాపాడుకోవాలంటే నిత్య ఆహారంలో విటమిన్-ఏ అధికంగా ఉండే క్యారెట్, ఆకుకూరలు, చేపలు తదితర పోషకాహార పదార్థాలను తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. కార్యక్రమంలో కొట్ర, హేమ్లాలాల్, పోతుల సుకుమార రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ ఓరుగంటి శ్రీనివాస్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.


