నాగర్‌కర్నూల్, ఆగస్టు 21: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న 50 సంవత్సరాలు దాటిన వారికి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న పాత కలెక్టరేట్ భవనంలోని గది నంబర్ 102లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరంలో 50 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక కంటి పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల్లో కంటి శుక్లాలు (క్యాటరాక్ట్) ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ అవసరమైన వారికి మహబూబ్‌నగర్ ఏనుగొండలోని లయన్ రామ్‌రెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎంపికైన రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించనున్నట్లు పేర్కొన్నారు.
శిబిరానికి వచ్చే వారు ముందుగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని వాటి రిపోర్టులను వెంట తీసుకురావాలని సూచించారు. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులో ఏదైనా ఒకదాని జిరాక్స్ కాపీతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు.
ఆపరేషన్ అనంతరం రోగులను ఈ నెల 29న ఉదయం 9 గంటలకు నాగర్‌కర్నూల్ పాత కలెక్టరేట్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఆప్తాలమిక్ అధికారి తెలిపారు.
శిబిరం వివరాలు
తేదీ: 27-08-2026, గురువారం
సమయం: ఉదయం 9:00 నుంచి 11:00 గంటల వరకు
స్థలం: గది నం. 102, పాత కలెక్టరేట్ భవనం, ఆర్టీసీ బస్టాండ్ పక్కన, నాగర్‌కర్నూల్
అర్హులు: 50 సంవత్సరాలు దాటిన వారు
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 9440876556, 7386940480
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


