కీసర: రేషన్ బియ్యం కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిపై ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.
కీసర చెరువు వద్ద వినాయక నిమజ్జనం డ్యూటీలో ఉన్న సమయంలో కారులో రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారని, వారిని గమనించిన ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసినట్లు సమాచారం.
రేషన్ బియ్యం కేసులో నిందితుల నుంచి కొంతకాలంగా లంచం డిమాండ్ చేస్తూ, వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేసినట్లు బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా కేసులో భాగంగా కెమికల్ టెస్టులు చేయించకుండా ముప్పుతిప్పలు పెట్టినట్లు పేర్కొన్నారు.
సీఐ అంజనేయులు కూడా నిందితుల నుంచి లంచం డిమాండ్ చేయడంతో పాటు, కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్డ్రింక్స్ తీసుకురావాలని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం.
బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిపై ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


