ఘట్కేసర్, సెప్టెంబర్ 28: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైతు సేవా సహకార సంఘం 46వ సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రుణమాఫీ అందలేదంటూ పలువురు రైతులు నిర్వాహకులను నిలదీయడంతో సమావేశం రసాభసగా మారింది. రైతులకు మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఘట్కేసర్లోని నారాయణ గార్డెన్స్‌లో రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో 46వ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. సభ కొనసాగుతుండగా అర్హత ఉన్నప్పటికీ తమకు రుణమాఫీ ఎందుకు వర్తించలేదంటూ పలువురు రైతులు నిర్వాహకులను గట్టిగా ప్రశ్నించారు.
ఈ క్రమంలో సంఘం అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఉద్రిక్తత తగ్గకపోవడంతో నిర్వాహకులు సమావేశాన్ని అర్థాంతరంగా వాయిదా వేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


