నాగర్కర్నూల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి జిల్లాను విద్యారంగంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిపేందుకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయి విద్యాశాఖ సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల వయస్సు ఉన్న ప్రతి చిన్నారి పాఠశాలలో చేరేలా అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పాఠశాలల్లో నమోదైన విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు.
తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి, ఆయా పాఠశాలల్లో నమోదు పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, బోధనా విధానాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఎఫ్ఎల్ఎన్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి
విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను చిన్న వయసులోనే పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. ఆశించిన స్థాయిలో విద్యా ప్రమాణాలు సాధించలేకపోతున్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందించాలని, డి-గ్రేడ్లో ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని వ్యక్తిగతంగా గుర్తించి, వారి సామర్థ్యానికి అనుగుణంగా బోధనా విధానాలను రూపొందించాలని సూచించారు. పీజీఐలో జిల్లాకు మెరుగైన స్థానం సాధించేలా ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం, మౌలిక వసతులు, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టాలని అన్నారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించి అవసరమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందాలి
భవితా కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలను ఈ నెల 31లోగా గుర్తించి, వారికి సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హత ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లలందరికీ చేయూత పింఛన్ అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఎస్టీ విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన పథకం ద్వారా అందించే ఉపకార వేతనాలు అర్హులైన ప్రతి విద్యార్థికి అందేలా చూడాలని సూచించారు. ఉపకార వేతనాల దరఖాస్తుల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
అర్హత ఉన్న ఒక్క విద్యార్థి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా పాఠశాల స్థాయిలోనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వెనుకబడిన పాఠశాలలను గుర్తించి వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
విద్యార్థుల నమోదు నుంచి విద్యా ఫలితాల వరకు ప్రతి అంశంలో గణనీయమైన పురోగతి కనిపించేలా కార్యాచరణ అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఈఓ ఏ. రమేష్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

