వనపర్తి జిల్లా, ఖిల్లా ఘణపురం: ఖిల్లా ఘణపురం మండల కేంద్రానికి చెందిన బుర్ర బాలస్వామి గౌడ్ ఇంట్లో శనివారం జరిగిన కుటుంబ వేడుకలో వండిన ఒడి బియ్యం తిన్న 26 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుంచి కొందరికి వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో వారిని వెంటనే ఖిల్లా ఘణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడి అవసరమైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అంబులెన్సులను అందుబాటులో ఉంచి ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు.
ఈ ఘటనకు కలుషిత ఆహారమే కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశంపై వైద్య, సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఖిల్లా ఘణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, వనపర్తి మండల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు చరణ్ రాజ్, కాంగ్రెస్ నాయకులు నందిమల్ల రాము తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


