పుల్లంపేట, సెప్టెంబర్ 23 (తొలి కిరణం): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని పుల్లంపేట మండల ఆరోగ్య కేంద్రంలో మండల స్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్ శేఖర్, డాక్టర్ అశ్విని చంద్ర ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు.
డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 25న 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలను ఉచితంగా అందించాలని సూచించారు. 1–5 ఏళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో, 6–19 ఏళ్ల బాలబాలికలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలు వేయించాలని తెలిపారు. పిల్లలకు మాత్రలు చేతికి ఇవ్వకుండా సిబ్బంది సమక్షంలో మింగించాలని, కార్యక్రమానికి హాజరుకాని పిల్లలకు వారి తల్లిదండ్రుల ద్వారా మాత్రలు వేయించాలని సూచించారు.
సెప్టెంబర్ 25న మాత్రలు తీసుకోని వారికి అక్టోబర్ 5న నిర్వహించే మ్యాప్అప్ డేలో డివార్మింగ్ చేయించాలని తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రల వినియోగంతో రక్తహీనతను నివారించడంతో పాటు పోషకాల గ్రహణశక్తి మెరుగుపడి, చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. నులిపురుగుల వ్యాప్తిని తగ్గించడం ద్వారా సమాజ ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిపారు.
సమావేశంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



