తొలి కిరణం న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 23న బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఎస్సీ, ఎస్టీ, బీసీల రణభేరి’ సభను విజయవంతం చేయాలని బీఎంపీ పార్లమెంట్ ఇన్చార్జ్ గడ్డం విజయ్ పిలుపునిచ్చారు. తాడూరు మండలంలోని రచ్ఛకట్ట వద్ద బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గడ్డం విజయ్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు ఎంత మొత్తం మంజూరు చేసి, ఎంత ఖర్చు చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నప్పటికీ, కేటాయించిన నిధుల్లో సగం కూడా పూర్తిస్థాయిలో మంజూరు చేసి ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. మిగిలిన నిధులను ఇతర ప్రాజెక్టులు, పథకాలకు దారి మళ్లిస్తూ దళిత, బహుజన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో గడిచిన 12 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సుమారు రూ.2 లక్షల కోట్ల నిధులు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. రానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ నిధుల వినియోగంపై అసెంబ్లీలో చర్చించాలని, భవిష్యత్లో ఆయా వర్గాల సంక్షేమానికి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్య సాధన కోసం ఆగస్టు 23న నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘ఎస్సీ, ఎస్టీ, బీసీల రణభేరి’ సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు, బహుజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గడ్డం విజయ్ కోరారు. ఈ కార్యక్రమంలో సోషలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు జిలకర బాలస్వామి, భారత్ ముక్తి మోర్చా జిల్లా నాయకులు కర్నె లక్ష్మయ్య, అంతటి పరశురాములు, గొర్ల సుల్తాన్, పోసగాళ్ల ఎల్లయ్య, మందడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

