శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఏటీఎం చోరీ కలకలం రేపింది. సాతం రాయ్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన దుండగులు పక్కా స్కెచ్‌తో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్‌ను కోసి సుమారు రూ.20 లక్షల నగదును అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.
తెల్లవారుజామున ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు ముందుగా సీసీ కెమెరాలపై స్ప్రే చేసి, వైర్లను కట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎం వద్ద నైట్ వాచ్‌మన్ లేకపోవడం దుండగులకు కలిసొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించారా? చోరీ వెనుక స్థానికుల ప్రమేయం ఉందా? లేక ఏటీఎంలను టార్గెట్ చేసే ముఠా పనేనా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


