తాడూరు, సెప్టెంబర్ 28: నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భారీగా కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సివిల్ సప్లయ్, పోలీసు అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 8,755.883 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.19.59 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం దారి మళ్లింపు జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో మిల్లు యాజమాన్యంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో రైస్ మిల్లు మేనేజింగ్ పార్టనర్ పొనుగంటి సుధాకర్రావుతో పాటు మరో నలుగురు భాగస్వాములపై కేసు నమోదు చేసినట్లు తాడూరు ఎస్ఐ ఎం. రాము తెలిపారు.
భారీ మొత్తంలో ధాన్యం కొరతకు కారణాలు ఏమిటి, ప్రభుత్వ ధాన్యం ఎక్కడికి తరలించబడింది అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం లెక్కల్లో భారీ వ్యత్యాసం వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


