అచ్చంపేట, సెప్టెంబర్ 2:
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని BC,SC,ST-JAC & DSP నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట MRO కార్యాలయంలో DSP మండల నాయకులు విష్ణు మహారాజ్ ఆధ్వర్యంలో మండల RIకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా BC,SC,ST-JAC జిల్లా కో-ఆర్డినేటర్, DSP జిల్లా అధ్యక్షులు సాయి మహారాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ఫలితంగా అనేక మంది విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతోందని అన్నారు. కొంతమంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య ప్రభావం విద్యార్థుల కుటుంబాలపై కూడా తీవ్రంగా పడుతోందని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తమ విద్యను కొనసాగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, ప్రభుత్వం కళాశాలలకు ఫీజులు చెల్లించే వరకు వేచి ఉండకుండా విద్యార్థుల సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యాలు నిలిపివేయకుండా వెంటనే అందజేయాలని స్పష్టమైన జీవో జారీ చేయాలని సాయి మహారాజ్ డిమాండ్ చేశారు. విద్యార్థుల చదువులు, భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో BC,SC,ST-JAC మండల నాయకులు విజయ్, వామావత్ గోపాల్ నాయక్, శ్రీను ముదిరాజ్, DSP మండల నాయకులు విష్ణు, వీరయ్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

