హైదరాబాద్: దళిత జర్నలిస్టులకు సంక్షేమ పథకాల్లో తొలి ప్రాధాన్యత కల్పించాలని సీనియర్ జర్నలిస్టు ఇప్పల రాములు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దళిత జర్నలిస్టు ఫోరం 11వ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మారేడ్‌పల్లిలో దళిత జర్నలిస్టు ఫోరం సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఇప్పల రాములు మాట్లాడుతూ.. వచ్చేనెల 7వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దళిత జర్నలిస్టు ఫోరం 11వ మహాసభలకు దళిత జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 11 సంవత్సరాలుగా దళిత జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసి, దళిత జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతూ వారికి అండగా నిలుస్తున్న ఫోరం జాతీయ అధ్యక్షుడు కశాపోగు జాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ఎల్లేష్ మాట్లాడుతూ.. దళిత జర్నలిస్టులకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నట్లు తెలిపారు.
మహాసభల్లో దళిత జర్నలిస్టుల హక్కుల సాధన, వారి సమస్యలు, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై చర్చించి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మీసాల ఎల్లేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి శివకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు యాదగిరి, రాజశేఖర్, రఘురాజు, రాయుడు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


