నాగర్‌కర్నూల్ జిల్లా: ప్రతినిధి ఆవంచ సాల్వాచారి (తొలి కిరణం)
నాగర్‌కర్నూల్ పట్టణంలోని 11వ వార్డు సమస్యలకు నిలయంగా మారిందని వార్డువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, శిథిలావస్థకు చేరిన మ్యాన్‌హోళ్లు, ధ్వంసమైన రహదారులు, నిలిచిపోయిన పారిశుధ్య పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు.
వార్డులోని ప్రధాన రహదారులపై డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల మూతలు ధ్వంసమై ఉండటంతో పాటు పలుచోట్ల మ్యాన్‌హోళ్లు పూర్తిగా తెరిచి ప్రమాదకరంగా మారాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళల్లో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు రహదారులపైకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
మరోవైపు రోడ్ల పక్కన చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు డ్రైనేజీ కాలువల్లో చెత్త, పిచ్చిమొక్కలు పేరుకుపోయి మురుగునీటి ప్రవాహం స్తంభించిపోతోందని ఆరోపిస్తున్నారు. దీంతో దోమల బెడద పెరిగి ప్రజారోగ్యంపై ఆందోళన నెలకొంది.
అలాగే పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల అంచులు, డ్రైనేజీ స్లాబులు ధ్వంసమయ్యాయి. రహదారులపై ఏర్పడిన గుంతలను రాళ్లు, మట్టితో తాత్కాలికంగా పూడ్చుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం లభించడం లేదని వార్డువాసులు పేర్కొన్నారు.
తమ సమస్యలను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ఆరోపించారు.
తక్షణమే సమస్యలు పరిష్కరించాలి
ధ్వంసమైన మ్యాన్‌హోళ్లకు వెంటనే కొత్త మూతలు ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి నిలిచిపోయిన పారిశుధ్య పనులను పునరుద్ధరించాలని వార్డువాసులు డిమాండ్ చేస్తున్నారు. రహదారులు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు

