తెలకపల్లి: తెలకపల్లి మండలం బొప్పెల్లి గ్రామానికి చెందిన సుప్రియకు పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బంది ఆమెను తెలకపల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన శిశువులో స్పందన లేకపోవడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో 108 అంబులెన్స్ సిబ్బంది వైద్యుల సూచనల మేరకు శిశువును ఆసుపత్రికి తరలిస్తూనే మార్గమధ్యంలో నిరంతరం CPR నిర్వహిస్తూ, కృత్రిమ శ్వాస, ఆక్సిజన్ అందించారు. సిబ్బంది సమయస్ఫూర్తితో చేసిన ప్రయత్నాల ఫలితంగా మార్గమధ్యంలోనే శిశువులో కదలికలు ప్రారంభమయ్యాయి. నాగర్కర్నూల్ సమీపానికి చేరుకునే సమయానికి శిశువు బాగా ఏడవడం ప్రారంభించాడు. శిశువుకు ప్రాణాలు నిలిపేందుకు 108 సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, సేవాభావాన్ని వైద్యులు అభినందించారు. తమ బిడ్డకు ప్రాణం పోసిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


