తొలి కిరణం – అక్టోబర్ 31 – ఘట్కేసర్ ప్రతినిధి:
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సాగించిన చారిత్రాత్మక పోరాటాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరు జైచంద్ర, సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ.. 1920 అక్టోబర్ 31న కాన్పూర్‌లో ఏఐటీయూసీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. బ్రిటిష్ పాలన కాలంలో దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యమవుతూనే కార్మికుల హక్కుల కోసం సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు.
కార్మికులకు శాశ్వత ఉద్యోగ భద్రత, ధరల సూచిక ఆధారంగా వేతనాల సవరణ, యాజమాన్యాలతో వివాదాల పరిష్కారం, సమ్మె చేసే హక్కు వంటి అనేక హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. కార్మికులు నేడు పొందుతున్న పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాల వెనుక కార్మిక సంఘాల సుదీర్ఘ పోరాటాలు ఉన్నాయని వివరించారు.
అయితే 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను బలహీనపరిచే విధంగా చర్యలు చేపడుతోందని నాయకులు విమర్శించారు. కోవిడ్ సమయంలో పార్లమెంట్లో పాత కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారని ఆరోపించారు. ఈ కొత్త చట్టాల వల్ల కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, గతంలో అమల్లో ఉన్న 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ రాష్ట్ర నాయకులు రామచందర్, సీపీఐ మండల స్థాయి కార్యదర్శి సయ్యద్ ఖదీర్, సువర్ణ, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బాల నరసింహ, కార్యదర్శి చౌదరి, మున్సిపల్ నాయకులు రామ్‌కుమార్ రాజు, అరుణ, బాలమణి, రమాదేవి, శోభ, భూపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


