మేడ్చల్–మల్కాజ్గిరి, ఆగస్టు 29: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న “కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనపై సమరభేరి” కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో విస్తృత కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ప్రజా సమస్యలపై విస్తృత చర్చ
సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పరిస్థితి, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అభివృద్ధి పనుల్లో జాప్యం, సంక్షేమ పథకాల అమలులో నెలకొన్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నాయకులు నిర్ణయించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ వైఫల్యాలను కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం చేయకుండా.. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు.
స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో ప్రధానంగా 22ఏ సమస్య, పెండింగ్ అభివృద్ధి పనులు, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, ట్రాఫిక్ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, సంక్షేమ పథకాలు తదితర స్థానిక సమస్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది.
“కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ప్రజలకు ఏం దక్కింది? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఎన్ని కొనసాగుతున్నాయి?” అనే ప్రశ్నలను ప్రజల ముందుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమరభేరికి సిద్ధం కావాలని సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నాయకత్వంలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


