తొలి కిరణం, సెప్టెంబర్ 29, ఘట్కేసర్ ప్రతినిధి: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేపాల్ వద్ద రైల్వే పట్టాల సమీపంలో కాపరి నిద్రిస్తున్న సమయంలో రైలు శబ్దానికి భయపడిన గొర్రెలు ఒక్కసారిగా పట్టాలపైకి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాజీపేట నుంచి హైదరాబాద్ నాంపల్లికి వెళ్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ రావడంతో పట్టాలపై ఉన్న గొర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 100కుపైగా గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన గొర్రెలు యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అల్లినగర్కు చెందిన యజమానులకు చెందినవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


