తొలికిరణం నవంబర్ 25 ఘట్కేసర్ ప్రతినిధి
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు కేవలం వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ చోరీతో సంబంధం ఉన్న 10 మంది నిందితులను మంగళవారం యంనంపేట్ ఎక్స్ రోడ్ వద్ద అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని లేక్ వ్యూ ఎన్క్లేవ్, వైష్ణవి రెసిడెన్సీలో నివాసముండే వి. నవీన్ కుమార్ (45) ఈ నెల 14న మధ్యాహ్నం తన కుటుంబంతో కలిసి ఇంటికి తాళం వేసి బోడుప్పల్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లారు. తిరిగి 18వ తేదీ ఉదయం ఇంటికి వచ్చి చూడగా డైనింగ్ హాల్ పక్కన ఉన్న కిటికీ పగలగొట్టి ఉంది. బెడ్రూమ్లోని బీరువాలో భద్రపరిచిన సుమారు 18 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న పోలీసులు క్రైమ్ నం. 674/2026 (సెక్షన్లు 331(4), 305(ఏ), 317(2) బిఆన్ఎస్) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పట్టుబడిన నిందితుల వివరాలు:
దర్యాప్తులో ప్రధాన నిందితులైన కే. సామెల్ అలియాస్ నాని (19), పిట్టల ఉమర్ అలియాస్ షేక్ ఉమర్ (18) అలవాటుపడిన ఆస్తి నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నారు. వీరితో పాటు చోరీ సొత్తు దాచడంలో, విక్రయించడంలో సహకరించిన షేక్ సద్దాం షరీఫ్ (21), పిట్టల పాపిత (33), మార్కల సాయి కుమార్ (21), ఎస్డి సిద్ధిక్ (22), నోకతల మోతీలాల్ (29), నోకతల షబ్బు (24), శక్తి విశాల్ (24), మరియు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాకు చెందిన గనసాల రైలాన్ మ్యాక్స్ (20) లను పోలీసులు అరెస్టు చేశారు. తునికి చెందిన మనుసాల వెంకటేష్ (24) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి బంగారు ఆభరణాలు నెక్లెస్ 1.4 తులాలు, బుట్ట కమ్మలు 1.5 తులాలు, చంద్రహారం 2 తులాలు, జడపువ్వు 0.5 తులాలు, గొలుసు 1 తులం, విరిగిన పొడవాటి గొలుసు 2.8 తులాలు మరియు రెండు ఉంగరాలు 0.8 గ్రాములు. సుమారు 24 తులాల వెండి ఆభరణాలు. నగదు రూ. 1 లక్ష 5వేయిలు, విలువైన రెండు ఐఫోన్లు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మరియు రూ. 53 వేలు నగదును పోలీసులు రికవరీ చేశారు.
* పోలీసు అధికారులకు కమిషనర్ అభినందనలు:
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపిఎస్ మార్గదర్శకత్వంలో ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ పి. కిరణ్, ఎస్ఐ ఎ. రాఘవేంద్ర నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకుంది. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుళ్లు ఆర్. రాజేష్, పి. విజయ్ కుమార్, కానిస్టేబుళ్లు పి. రాజు, ఎన్. నరేష్, నరేందర్, బి. సైదులు, మహిళా కానిస్టేబుల్ బి. మహేశ్వరి, హోంగార్డు బి. శ్రీనులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


